దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు కశ్మీర్ తర్వాత హైదరాబాద్ పై ఫుల్ ఫోకస్ పెట్టిందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఉత్తరాదిన బాగా బలమున్న బీజేపీకి దక్షిణాదిన మాత్రం కర్ణాటక తప్ప వేరే రాష్ట్రాల్లో ఉనికే లేదు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో బలపడాలని చూస్తున్న బీజేపీ దీనికోసం దక్షిణాది ప్రజల మనసు గెలుచుకోవడానికి దేశ రెండోరాజధాని అంశాన్ని తెరపైకి తీసుకోస్తోందని ప్రచారం సాగుతోంది.
కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన బీజేపీ ఇప్పుడు దేశ రెండో రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. అంబేద్కర్ నాడు దేశ ప్రజల్లో అత్మనూన్యత అభద్రత భావం తగ్గించడానికి ఢిల్లీతోపాటు దక్షిణాదిన హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని సూచించాడు. ఈ మేరకు బొల్లారంలో రాష్ట్రపతి రెండో నివాసంను కూడా ప్రతిపాదించారు.
అయితే దేశ రెండో రాజధాని అంశం మాత్రం రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. అది మరుగున పడిపోయింది. అందుకే ఇప్పుడు బీజేపీ కశ్మీర్ తర్వాత రెండో అస్త్రం హైదరాబాదేనన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.
ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎప్పుడో హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిని చేయాలని నివేదిక ఇచ్చారట.. ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.
