Tuesday, May 14, 2024
- Advertisement -

సూర్య ’24’మూవీ రివ్యూ!

- Advertisement -

శివ కుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్. తన భార్య ప్రియ (నిత్యా మీనన్), నెలల వయసుండే కొడుకుతో కలిసి ఓ ప్రశాంతమైన పరిసరాల్లో జీవిస్తూ, ఓ వాచీని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ వాచీతో కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళే అవకాశం ఉండడమే దాని ప్రత్యేకత. అలాంటి వాచీని తన సొంతం చేసుకోవాలని శివకు కవల సోదరుడైన ఆత్రేయ (సూర్య) ప్రయత్నిస్తూంటాడు.

అలాంటి ప్రయత్నాల్లోనే కొన్ని అనూహ్య పరిస్థితుల్లో, శివ, ప్రియ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ వాచీని, తమ కుమారుడిని ఎవరో తెలియని ఓ యువతి (శరణ్య) చెంత చేరుస్తారు. 26 ఏళ్ల తరువాత, తల్లి శరణ్యతో సంతోష జీవితం గడిపే మణి (సూర్య)కు తమ వద్ద ఉండే ఆ వాచీ గురించి తెలుస్తుంది. మణికి ఈ వాచీ దొరికిందన్న విషయం కూడా అప్పుడే 26ఏళ్ళు కోమాలో ఉండి బయటకొచ్చిన ఆత్రేయకు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వాచీ ఎలా పనిచేస్తుంది? మణి దగ్గర వాచీ ఉందని తెలుసుకున్న ఆత్రేయ అతడ్ని ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.

ఇదో సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌. అలాగ‌ని కేవ‌లం సైన్స్‌ని మాత్ర‌మే న‌మ్ముకుని ద‌ర్శ‌కుడు చిత్రాన్ని న‌డిపించ‌లేదు! దాంతోపాటు ఎమోష‌న్స్‌ను క‌థ‌లో రంగ‌రించి ఎక్క‌డా ఎలాంటి బోర్ కొట్ట‌కుండా చ‌క్క‌ని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఒక మ్యాజిక్‌తో క‌థ‌ను మొద‌లుపెట్టి… ఆ మ్యాజిక్‌ను చివ‌రిదాకా కొన‌సాగించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

సినిమా ప్రారంభం నుంచే అస‌లు క‌థ‌లోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. ఎక్క‌డా ఎలాంటి టైమ్ వేస్ట్ చేయకుండా తొలి 15 నిమిషాల్లోనే ఆడియ‌న్స్‌ను ఒక కొత్త లోకంలోకి ఆహ్వానించేశాడు. సైంటిస్ట్ పాత్ర‌లో సూర్య ఎంట్రీ… ఆ త‌రువాత‌, విల‌న్ పాత్ర‌లో మ‌రో సూర్య ఎంట్రీ… వ‌రుస‌గా సాగిపోతాయి. ఆ త‌రువాత‌, ప్రెజెంట్ టైమ్‌లో సూర్య పాత్ర ఎంట్ర‌న్స్ నుంచి అస‌లు మ్యాజిక్ మొద‌లౌతుంది. ఆ వాచ్ సూర్య పెట్టుకున్న ద‌గ్గ‌ర నుంచి అస‌లు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ వాచ్ చేతికి వ‌చ్చిన త‌రువాత కొన్ని అద్భుతాలు జ‌రుగుతాయి. ఆ అద్భుతాల‌ను విజువ‌ల్‌గా అద్భుతంగానే తెరకెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఈ కాన్సెప్ట్‌లోనే ప్రేమ‌క‌థ‌ను కూడా న‌డిపించ‌డం చాలా బాగుంద‌నే చెప్పాలి. ఇలా సాఫీగా సాగిపోతున్న క‌థ‌లోకి మ‌రోసారి విల‌న్ రీ ఎంట్రీ… ప్రేక్ష‌కుడి ఊహ‌కు అంద‌ని ట్విస్ట్‌తో ఇంట‌ర్‌వెల్ బ్యాంగ్ ఇచ్చారు.

ఇక‌, ద్వితీయార్థం విష‌యానికొస్తే… ప్ర‌థ‌మార్థంతో పోల్చితే కాస్త నెమ్మ‌దిగా క‌థ‌నం సాగింద‌నే చెప్పాలి. ప్ర‌థ‌మార్థంలో ఉన్న విల‌నిజం డోస్ కూడా కాస్త త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఒక ఫ్యామిలీ డ్రామా కాసేపు సాగుతుంది. ఇది కామెడీ ప‌రంగా బాగానే ఉన్నా… అస‌లు కథ‌ను కాసేపు ప‌క్క‌న ప‌డేసిన‌ట్టు అనిపిస్తుంది. కానీ, అక్క‌డా ఎక్కువ టైమ్ వేస్ట్ చేయ‌కుండా మ‌ళ్లీ అస‌లు క‌థ‌లోకి మ‌ళ్లీ ప్రేక్ష‌కుల్ని తీసుకొచ్చేసి… అనూహ్య‌మైన మ‌లుపుల‌తో ప్రీక్లైమాక్స్‌… క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌.

రొటీన్ రివేంజ్ స్టోరీలూ… రొటీన్ ప్రేమ‌క‌థా చిత్రాల‌కు భిన్నంగా ఒక కొత్త క‌థ‌తో తెర‌కెక్కిన చిత్రం ఇది. చాలా రోజుల త‌రువాత న‌టుడిగా సూర్య విశ్వ‌రూపం విల‌న్ పాత్ర‌లో క‌నిపించింద‌నే చెప్పాలి. క‌థ‌లో కొత్త‌ద‌నంతోపాటు, ఎమోష‌న్స్‌ను కూడా చ‌క్క‌గా క్యారీ చేసుకుంటూ సాగిన క‌థ ఇది. ఒక‌ప‌క్క అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండానే… స్థానిక అంశాల‌ను కూడా ఏమాత్రం విస్మ‌రించ‌కుండా బ్యాలెన్స్‌డ్‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. హీరో సూర్య‌ని మూడ్ డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో చూడాల‌నుకునేవారికీ… ఒక కొత్త క‌థ కావాల‌నుకునేవారికీ… ఈ చిత్రం చాలా బాగా న‌చ్చుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -