డ్రెస్సు సరిగ్గా వేసుకోలేదని చెప్పారని మందలింపుతో మహిళ ఆగ్రహం
మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులపై చిత్తూరు జిల్లాలో కేసు నమోదైంది. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడం కలకలం సృష్టిస్తోంది. వారు ఏం చేశారు.. ఎందుకు కేసు నమోదు చేశారని సర్వత్రా చర్చ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో మోహన్‌బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలో పనిచేసే టీచరే మోహన్‌బాబు, విష్ణు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ఎందుకు? ఏం జరిగిందో చదవండి.
హైదరాబాద్‌కు చెందిన బ్యూలా అనే మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని శ్రీవిద్యానికేతన్‌లో అధ్యాపకురాలి (లెక్చరర్)గా వచ్చారు. ఈమె విదేశాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. చేరే సమయంలోనే తన డ్రెస్సింగ్ విషయంలో ఉండే నిబంధనలు చెప్పి చేరారు. అయితే కొన్నాళ్లకు తన డ్రెస్సింగ్‌ను తప్పు పడుతూ తనను కేంద్రంగా చేస్తూ యాజమాన్యం చర్యలు తీసుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడారి నవంబర్ 28వ తేదీన కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో తన డ్రెస్సింగ్‌పై అవమానించారని.. పిలిచి మందలించారని తెలిపారు. డ్రెస్ కోడ్ సరిగా లేదని నిలదీయడంతో కలత చెంది ఆ రోజు నుంచి కళాశాలకు వెళ్లడం లేదు.
అయితే రెండు నెలల తర్వాత ఎలాంటి నోటీసులు లేకుండా బ్యూలాను సస్పెండ్ చేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎలా సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నిస్తూ చంద్రగిరి పోలీసులను ఫిర్యాదు చేసింది. తన డ్రెస్సింగ్ విషయంలో పురుషులందరి ముందు తనను మందలించడంతో తాను కలత చెందానని.. విదేశీ టీచర్లను ఒకలా.. తమను ఒకలా చూడడంపై మండిపడ్డారు. కళాశాల ప్రాంగణంలో వివక్ష కొనసాగుతోందని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది మహిళా మనోభావాలను అవమానించారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించానని చెప్పారు. అయితే ఆమె ఫిర్యాదుతో చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
