మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్-150’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీస్కొని ప్రస్తుతం మేకప్ వేసుకుంటున్నాడు. పిరియాడికల్ డ్రామాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో రావడానికి సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను చైనా దేశంలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే భారతదేశంలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేశారు.
ఇటీవల చైనాలో బాహుబలి సినిమా అక్కడి సినీ రికార్డులను తిరగరాయడంతో సైరా సినిమా బృందం చైనా మార్కెట్‌పై కూడా ఫోకస్ పెట్టింది. ఈ సినిమా షూటింగ్ కొంత చైనాలోనే చేస్తుండడంతో ఈ సినిమాను అక్కడ విడుదల చేయాలని అన్నింటా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్, భజరంగీ భాయిజాన్, బాహుబలి’ సినిమాలు చైనాలో విడుదలై ఘన విజయం దక్కించుకోవడంతో ‘సైరా’ కూడా అక్కడి ప్రేక్షకుల్ని అలరించేందుకు విడుదల చేయాలని చూస్తున్నారు. భారతదేశం కన్నా చైనాలో జనాభా ఎక్కువ. ప్రేక్షకులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉండడంతో సైరా సినిమా బృందం చైనాపై ఫోకస్ పెట్టింది.
చైనాలో షూటింగ్ చేస్తే విదేశీ సినిమాలకు అక్కడి ప్రభుత్వం మంచి రాయితీ అందిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్‌ను మొదలుపెట్టనుంది. తన తండ్రికి మంచి సినిమాగా నిలపాలని రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి తదితర నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
