Thursday, April 25, 2024
- Advertisement -

ధియేటర్ల దగ్గర అభిమానుల రచ్చ… అల్లరి చేసిన ఉపాసన

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినీ అభిమానుల కల నెరవేరింది. పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్పెషల్ షోస్, ప్రీమియర్ షోస్‌ నుంచే అభిమానులు థియేటర్ల వద్ద చేసిన రచ్చ మామూలుగా లేదు.

దర్శక దిగ్గజం రాజమౌళి మేధస్సుకు, సృజనాత్మకతకు అద్దంపట్టే చారిత్రక నేపథ్యమున్న భారీ చిత్రం ఆర్‌ఆర్ఆర్. విడుదలైన తొలి రోజే ఈ సినిమాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్ థియేటర్ల దగ్గర కనిపించిన సందడి అంతా ఇంతా కాదు.

రామ్‌చరణ్ భార్య ఉపాసన అభిమానులతో కలిసి సందడి చేశారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్ షోను చూశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రతో చరణ్ తెరపైన కనిపించిన ప్రతీసారి ఉపాసన పేపర్లు విసిరి నానా అల్లరి చేశారు. దాంతో అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అయింది.

నిజామాబాద్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈలలేసి గోల చేశారు. జూనియర్ ఎన్డీఆర్, రామ్ చరణ్ కటౌట్లకు క్షీరాభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు. తిరపతిలో సినిమా హాళ్ల దగ్గర రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాహుబలి రికార్డులను ట్రిపుల్ ఆర్ బద్ధలకొడుతుందంటూ అభిమానులు నినాదాలు చేశారు. హైదరాబాద్‌లో స్పెషల్ షోస్‌, మార్నింగ్ బెన్ఫిట్ షోస్ నుంచే సినిమా హాళ్ల దగ్గర ఫ్యాన్స్ సందడి కనిపించింది. వనస్థలిపురం సుష్మ థియేటర్ వద్ద బ్యాండ్ బాజాలతో అభిమానులు డ్యాన్సులు చేశారు. తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలాభిషేకం చేశారు.

ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎస్వీ మ్యాక్స్ థియేటర్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని చనిపోయాడు. సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

విజయవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ట్రిపుల్ ఆర్‌ షో నిలిచిపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. సాంకేతిక కారణాలతో సినిమా షోను వేయలేకపోయారు. దీంతో అభిమానులు ఆందోళనలకు దిగారు. థియేటర్‌ అద్దాలను ధ్వంసం చేశారు. అభిమానుల ఆందోళనతో థియేటర్‌ రణరంగాన్ని తలపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -