Friday, April 19, 2024
- Advertisement -

దర్శక నిర్మాతలు.. నటులైన వేళ!

- Advertisement -

సినిమాలను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు తెరపైకి రావడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. 1970ల నుంచే తెలుగులో అలాంటి ట్రెండ్ కొనసాగుతోంది. ఎల్వీ ప్రసాద్ లాంటి దిగ్దర్శుకులు సైతం ముందు నటనలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాకే దర్శకులుగా మారారు. అయితే తాము నిర్మించి/దర్శకత్వం వహించిన చిత్రాలలో కాకుండా ఇతరుల సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఐదుగురు దర్శక నిర్మాతల గురించి..

ఎల్వీ ప్రసాద్ (అమావాస్య చంద్రుడు)
1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమావాస్య చంద్రుడు’ సినిమాలో హీరోయిన్ మాధవికి తాతయ్యగా ఎల్వీ ప్రసాద్ నటించారు. ఆయన కెరీర్ ప్రారంభంలో కొన్ని చిత్రాల్లో నటించినా, 73 ఏళ్ల వయసులో చేసిన ఈ పాత్ర ఎక్కువమందికి గుర్తుండిపోయింది. ఈ చిత్రానికి కమలహాసన్ హీరోతో పాటు నిర్మాత కూడా కావడం విశేషం.

జంధ్యాల (ఆపద్బాంధవుడు)
చిరంజీవి హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో​ వచ్చిన ఈ సినిమాకి జంధ్యాలే మాటల రచయిత. రాస్తూ రాస్తూ ఉండగా ఇందులో చిరంజీవిని ఆదరించే హీరోయిన్ తండ్రి పాత్ర మీద విపరీతమైన ఇష్టం పెంచుకున్నారు ఆయన. ఆ పాత్ర తాను వేయాలన్న కోరికను మొహమాటంగానే విశ్వనాథ్ గారి ముందు ఉంచి, ఒప్పించారు. ఆ పాత్రను చిరకాలం గుర్తుండేలా పోషించారు.

దాసరి నారాయణరావు (మామగారు)
దాసరి నారాయణరావు గారి నట జీవితంలో మర్చిపోలేని చిత్రం ‘మామగారు’. అందులో ఆయన పోషించిన సత్తెయ్య పాత్ర ఆయనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందించింది. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని కన్నడంలో తీసినప్పుడు దాసరి పాత్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోషించారు.

పోకూరి బాబూరావు (ప్రేమ తపస్సు)
ఈతరం ఫిల్మ్స్ ద్వారా ‘యజ్ఞం’, ‘రణం’ తదితర చిత్రాలు తీసిన పోకూరి బాబూరావు తెలుగు పరిశ్రమలో ప్రసిద్ధ నిర్మాత. 1991లో నటుడు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ దర్శకత్వం వహించిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంలో శివంగి అనే విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ హీరో కాగా, హీరోయిన్ రోజాకు ఇదే తొలి సినిమా.

డి.రామనాయుడు(హోప్)
తాను​ నిర్మించిన చిత్రాల్లో అక్కడక్కడా అతిథి పాత్రల్లో కనిపించిన రామనాయుడు గారు ఒక సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో నటించారు. 2006లో సతీశ్ కాసెట్టి దర్శకత్వం వహించిన ‘హోప్’ అనే సినిమాలో రిటైర్డ్ ప్రొఫెసర్ పాత్ర​లో పోషించారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో సాగే ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ సామాజిక అంశం గల సినిమాగా పురస్కారం అందుకుంది. ఇందులో రామానాయుడు గారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు డబ్బింగ్ చెప్పడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -