మహారాష్ట్రలోని బీడ్ (Beed) జిల్లాలో సంచలనం సృష్టించిన కిరణ్ సోనవనే అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే ఛేదించారు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం కింద పడి ఉన్న శవాన్ని చూసి మొదట రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. పోలీసుల విచారణలో అది భార్య, ఆమె ప్రియుడు కలిసి చేసిన పక్కా ప్లాన్ హత్యగా తేలింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కట్టుకున్న భర్తను దారుణంగా అంతమొందించిన భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు దశరథ్ పరదేశి, అతని స్నేహితుడు ధీరజ్ యేడేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బీడ్ జిల్లాకు చెందిన కిరణ్ సోనవనేకు ప్రియాంకతో వివాహం జరిగింది. అయితే ప్రియాంకకు దశరథ్ పరదేశితో ఏర్పడిన వివాహేతర సంబంధం కాస్తా భర్త కిరణ్‌కు తెలిసింది. దీనికి తోడు భర్త కిరణ్ తనను నిరంతరం వేధిస్తున్నాడనే కోపంతో ప్రియాంక.. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం ఘటనా స్థలానికి చేరుకున్న ప్రియుడు దశరథ్, అతని స్నేహితుడు ధీరజ్ కలిసి కిరణ్ గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఈ దారుణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రోడ్డు పక్కన ఒక టూ వీలర్ కింద పడేశారు. హత్య విజయవంతంగా ముగిసిన వెంటనే దశరథ్ తన గర్ల్‌ఫ్రెండ్ ప్రియాంకకు ఫోన్ చేసి ‘ప్రోగ్రామ్ ఓకే’ అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో సమాచారం అందించడం గమనార్హం.
పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకపోవడం (గొంతు నులమడం) వల్లే కిరణ్ చనిపోయాడని తేలింది. శవం పడి ఉన్న తీరుపై స్థానిక ఇన్వెస్టిగేషన్ అధికారులకు గట్టి అనుమానం రావడంతో టెక్నికల్ విచారణ చేపట్టారు. సాక్ష్యాల ఆధారంగా నిందితుల కాల్ డేటాను పరిశీలించగా ఈ ఘోర హత్య ఉదంతం బయటపడింది. నేరం చేసిన తర్వాత ముగ్గురు నిందితులు బీడ్ జిల్లా నుండి పారిపోయి ముంబై సమీపంలోని పాన్వెల్ (Panvel) లో తలదాచుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల లొకేషన్ ఆధారంగా పాన్వెల్‌లో దాడి చేసి ముగ్గురినీ కస్టడీలోకి తీసుకున్నారు. వారిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
