సీనియర్ నటుడు బాలయ్య ఇక లేరు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య(92) తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అమృత ఫిల్మ్స్‌ సంస్థ బ్యానర్‌పై శోభన్ బాబు హీరోగా ‘చెల్లెలికాపురం’, సూపర్ స్టార్ కృష్ణతో ‘నేరము – శిక్ష’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ చిరంజీవితో ‘ఊరికిచ్చిన మాట’ వంటి చిత్రాలను బాలయ్య నిర్మించారు.

ఊరికిచ్చిన మాట చిత్రంతో ఉత్తమ రచయితగా బాలయ్య నంది అవార్డు అందుకున్నారు. నిర్మాతగా ‘చెల్లెలి కాపురం’ సినిమాకు నిర్మాతగా నంది అవార్డు దక్కించుకున్నారు. ఎత్తుకు పై ఎత్తు చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన బాలయ్య 300 పై చిలుకు చిత్రాల్లో నటించారు. 1930లో గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు సాహిత్యాభిలాషులు కావడంతో కొడుకును బాగా చదివించాలనుకున్నారు.. అందుకే బాలయ్య ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

మిత్రుల ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేశారు. కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడిగా ఇలా ఇండస్ట్రీకి చెందిన పలు రంగాల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అయితే పుట్టిన రోజు నాడే బాలయ్య కన్నుమూయడం సినీ అభిమానులను కలచివేస్తోంది.

Related Articles

Most Populer

Recent Posts