ఏపీలోని రాజమండ్రిలో కలకలం చోటు చేసుకుంది.కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజమండ్రి నగర పరిధిలోని చౌడేశ్వరినగర్‌లో, వెంకటేశ్వర నగర్‌లో పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై.. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిలలాడారు బాధితులు.
బాధితులను వెంటనే రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించిన కారణాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. అందరూ ఒకే చోట పాలు కొనడంతో.. కల్తీ జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది.
పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే.. నిజాలు తెలుస్తాయంయని పోలీసులు చెబుతుండగా కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి అప్రమత్తమయ్యారు అధికారులు. కల్తీ పాలు తాగిన కాలనీలలో ఇంటింటా సర్వే చేయనున్నాయి 13 బృందాలు.
మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ హెల్త్ డిపార్ట్‌మెంట్, వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర బృందం ఆధ్వర్యంలో సర్వే చేపడుతున్నారు.
రాజమండ్రిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ముగ్గురు పసిపిల్లలకు డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. ఇప్పటికే అదే పాల వ్యాపారి వద్ద రెగ్యులర్‌గా పాలు వాడుతున్న ఇద్దరు డయాలసిస్ సమస్యతో 60 ఏళ్ల పైబడిన వారు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
