విజయవాడలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో బాలాజీ హోటల్‌లో ఒక వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నగరంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలాజీ హోటల్ వద్ద తనిఖీలు చేపట్టగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతను 9 ఎంఎం పిస్టల్‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
అయితే పిస్టల్‌లో ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటికి రాలేదు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాల్పుల యత్నం నేపథ్యంలో పోలీసులు నగరవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. విజయవాడ బస్టాండ్‌తో పాటు ముఖ్య ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితుడు వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అతని ఉద్దేశం ఏమిటి, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
