హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ తల్లి తన 14 నెలల చిన్నారిని హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గొల్కోండ పరిధిలోని రిసాల్ బజార్ ప్రాంతంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గౌసియా బేగం అనే మహిళ తన భర్తతో రంజాన్ పండుగకు బట్టలు కొనుగోలు చేసే విషయంపై తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఈ గొడవ క్రమంగా పెద్ద వివాదంగా మారినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌసియా బేగం క్షణికావేశంలో ఘోర నిర్ణయం తీసుకుంది.
ఆమె తన 14 నెలల చిన్నారి కూతురిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చిన్నారి ఊపిరి ఆడక మృతిచెందినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గౌసియా బేగంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పసికందు ప్రాణం తీసిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ వివాదాలు ఇంత దారుణ పరిణామాలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.
