భారతీయ చలనచిత్ర ప్రపంచంలో గ్రామీణ జీవనానికి, మట్టివాసనలకు సరికొత్త దృశ్యరూపం ఇచ్చిన ‘ఇయక్కునార్ ఇమయం’ (దర్శక శిఖరం) భారతీరాజా (Bharathiraja) కన్నుమూశారు. 1941 జులై 17న తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన ఆయన అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. కళలపై ఉన్న ఆసక్తితో పి.పుల్లయ్య, పుట్టణ్ణ కనగల్ లాంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా చేరి సినిమా మెలకువలు నేర్చుకున్నారు.
1977లో వచ్చిన ‘16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) సినిమాతో దర్శకుడిగా పరిచయమై అప్పటివరకు కేవలం నాలుగు గోడల స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, సహజమైన పల్లెటూరి అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో సినీ సంప్రదాయాలను తిరగరాశారు. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి లాంటి ఎందరో దిగ్గజ నటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.
గ్రామీణ చిత్రాలకే కాకుండా ‘ఎర్ర గులాబీలు’ లాంటి సైకో థ్రిల్లర్లతోనూ అలరించారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) సంచలనం సృష్టించింది. ఒక సందర్భంలో పల్లెటూరి కథలపై ఆయన చతురతతో స్పందిస్తూ.. “నేను ఒకమ్మాయితో ప్రేమలో పడ్డా, ఆమె నాకు ప్రతిసారీ పల్లెల్లోనే కనిపిస్తుంది.. ఆమె ఎవరో కాదు ప్రకృతికాంత” అంటూ పల్లెలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.
ఆయన ప్రతిభకు 6 జాతీయ అవార్డులు (సీతాకోకచిలుకతో సహా), 4 ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు దక్కాయి. సినీ రంగానికి చేసిన సేవలకుగానూ 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. దర్శకత్వంతో పాటు ‘ఆయుధ ఎళుతు’, ‘తిరు’, విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’ లో చివరిసారి కనిపించగా.. ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. తర్వాతి తరం మేకర్స్ కోసం ‘BRIIC’ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు.
