మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదంగా నమోదైన ఒక కేసు.. పోలీసుల దర్యాప్తులో ఊహించని మలుపు తీసుకుని సంచలన హత్యగా తేలింది. వివాహేతర సంబంధంతో పాటు రూ. 2 కోట్ల భారీ బీమా సొమ్ము కోసం ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను సుపారీ ఇచ్చి మరీ కిరాతకంగా చంపించింది. ఈ షాకింగ్ మర్డర్ మిస్టరీకి సంబంధించిన పూర్తి వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్ (45) మే 22న ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు మొదట భావించారు. అయితే కుమార్ మృతిపై అతని తల్లి లక్ష్మికి అనుమానం వచ్చి గుడిపేటకు చెందిన రామ్ మల్లేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఏసీపీ ప్రకాష్.. రూరల్ సీఐ రవీందర్ బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరపగా అసలు నిజం బయటపడింది. కుమార్ భార్య భారతికి అదే గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని వారిద్దరూ ఏడాదిన్నర క్రితమే (2025 జనవరి) పక్కా స్కెచ్ వేశారు.
కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఎల్ఐసీతో పాటు పలు కంపెనీల నుంచి సుమారు రూ. 2 కోట్ల క్లెయిమ్ వస్తుందని ఆశపడ్డ భారతి.. గత కొంతకాలంగా క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తూ వస్తోంది. కుమార్ తమకు అప్పుగా ఉన్న రూ. 60 వేల విషయంలో గొడవ పడుతున్న రామ్ మల్లేశ్‌ను భారతి.. సురేందర్‌లు తమ వైపు తిప్పుకున్నారు. అతనికి రూ. 10 లక్షల సుపారీ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్ కింద రూ. 2 లక్షలు చెల్లించారు. మల్లేశ్ ఒంటరిగా ఈ పని చేయలేక మంచిర్యాలకు చెందిన శ్రీరామ్‌తో చేతులు కలిపాడు. పథకం ప్రకారం మే 22న ముల్కల్ల గ్రామ శివారులో కుమార్‌కు అతిగా మద్యం తాగించి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశారు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు శవాన్ని.. బైక్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు.
పోలీసులు భారతి వ్యవహారశైలిని నిశితంగా గమనించి.. సురేందర్‌తో ఆమెకున్న బంధాన్ని ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బీమా పత్రాలు.. రూ. 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులైన భార్య భారతి.. ప్రియుడు సురేందర్‌తో పాటు సహకరించిన శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రామ్ మల్లేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
