శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రణస్థలంలో ఓ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.గ్రామానికి చెందిన ఒక కుటుంబం భూ రికార్డులను రెవెన్యూ శాఖలో తారుమారు చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి సమావేశమై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి పనులు ఇవ్వకూడదని, అలాగే శుభకార్యాలకు ఆహ్వానించకూడదని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో దండోరా ద్వారా తెలియజేశారు.
తాము పలుమార్లు ఆ కుటుంబానికి హెచ్చరికలు ఇచ్చినా, తమ మాటలను పెడచెవిన పెట్టారని గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వారు వివరిస్తున్నారు.ఈ ఘటనపై సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యక్తిగత వివాదాలను ఈ విధంగా సామాజిక బహిష్కరణగా మలచడం చట్టపరంగా కూడా సమస్యాత్మకమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలు మానవ హక్కులకు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు.
