పదవ తరగతి ఫలితాలు ఆ ఇంట్లో వెలుగులు నింపాల్సింది పోయి, తీరని కన్నీటిని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఒకే ఒక్క భయం, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తీరా ఫలితాలు వచ్చాక ఆమె ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
మెదక్ జిల్లా పాడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ అనే విద్యార్థిని ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాసింది. అయితే, పరీక్షలు సరిగ్గా రాయలేదేమోనని, ఫలితాల్లో ఫెయిల్ అవుతానని ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.ఫలితాల భయంతో సాయిప్రియ ఈ నెల 24వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. తన భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి, క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడటం ఆ గ్రామంలో విషాదం నింపింది.
నిన్న విద్యాశాఖ పదవ తరగతి ఫలితాలను విడుదల చేసింది. తన కూతురు ఎలాగూ లేకపోయినా, ఆమె మార్కులు చూడాలని తల్లిదండ్రులు ఆశగా ఫలితాలను చెక్ చేశారు.సాయిప్రియకు ఏకంగా 480 మార్కులు వచ్చాయి. అంటే ఆమె అత్యుత్తమ మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించింది.
మా బిడ్డ పాసవుతుందో లేదో అని భయపడింది.. కానీ ఇంత మంచి మార్కులతో పాసై మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది అంటూ సాయిప్రియ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 480 మార్కులు చూసి ఊరట చెందాలో, ఉన్న ఒక్క బిడ్డ లేదని ఏడవాలో తెలియని స్థితిలో వారు ఉన్నారు.పరీక్షా ఫలితాలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే, అవే జీవితం కాదు. ఫెయిల్ అయినా మళ్లీ రాసుకోవచ్చని, ప్రాణాలు తీసుకుంటే తిరిగి రావని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సూచన: మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా మానసిక ఒత్తిడితో లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతుంటే, వెంటనే సహాయం కోరండి. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు అందించే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించండి.
