తన ప్రాణాలకు ముప్పు ఉందని, గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపిన తరహాలోనే తనను కూడా అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ప్రముఖ పాస్టర్ అభినయ్ దర్శన్ ఆరోపించారు. ప్రస్తుత పోలీసుల విచారణ తీరుపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
తనపై జరిగిన దాడి ఉదంతంపై పాస్టర్ అభినయ్ దర్శన్ మీడియాతో మాట్లాడుతూ రక్షించాల్సిన పోలీసులే నిందితులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.
గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో.. ఆయన నాలుగు బ్రాండ్లు (మద్యం) తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలను సృష్టించారు. ఇప్పుడు నా విషయంలోనూ అదే జరుగుతోంది. అసలు నాపై దాడి చేసిన వారిని వదిలేసి, రక్షణగా ఉన్న నా అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. చివరకు నాపై నేనే దాడి చేయించుకున్నట్లుగా తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారు అన్నారు.
అంతేకాకుండా, సమాజంలో పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరించేందుకు కొన్ని శక్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ హస్తం ఉందా అనే ప్రశ్నకు ఆయన స్పష్టతనిచ్చారు. స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) విశ్వేశ్వర రాజుకి ఈ దాడి వ్యవహారంలో ఎలాంటి సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని చెప్పారు. అయితే, ఈ కుట్ర వెనుక కొంతమంది నిర్దిష్ట వ్యక్తుల హస్తం ఉందనే బలమైన అనుమానం తనకు ఉందని, తగిన ఆధారాలతో వారి పేర్లను త్వరలోనే బహిరంగా బయట పెడతానని హెచ్చరించారు.
