కొమురంభీం జిల్లాలో పెళ్లి పేరుతో పేద మహిళలను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారి తీసింది. జిల్లాలోని బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు పేద మహిళలు ఉపాధి కోసం మంచిర్యాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ వారికి పరిచయమైన మహారాష్ట్ర, మంచిర్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేస్తామని నమ్మబలికారు.
వారి మాటలను నమ్మిన మహిళలను దుండగులు మోసం చేసి, వారి ఫోన్లు తీసుకుని ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకెళ్లినట్లు సమాచారం.
కొన్ని రోజుల పాటు మహిళల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు వారు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మహిళలు ఇతర రాష్ట్రాల్లో పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. అనంతరం వారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకువచ్చారు.
ఈ ఘటనతో జిల్లాలో పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో అక్రమ రవాణా జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దళారులు పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మహిళా రవాణా కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
