పాకిస్తాన్‌తో క్రీడా రంగంలో వ్యవహరించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై భారత ఆటగాళ్లు, జట్లు — పాకిస్తాన్ ఆటగాళ్లు లేదా జట్లు పాల్గొనే అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌లో జరిగే పోటీల్లోనూ, ద్వైపాక్షిక క్రీడా పోటీల్లోనూ పాల్గొనదని స్పష్టంచేసింది.
అదేవిధంగా, అంతర్జాతీయ క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు, టెక్నికల్ సిబ్బంది, క్రీడాకారుల కోసం వీసా విధానాన్ని సరళీకృతం చేస్తామని యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MYAS) గురువారం వెల్లడించింది. గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు బహుళ ప్రవేశ వీసాలు జారీ చేస్తామని మంత్రిత్వ శాఖ వర్గాలు ధృవీకరించాయి.
ఆసియా కప్ (సెప్టెంబర్ 14, దుబాయ్‌లో)లో భారత్-పాక్ జట్లు తలపడబోతున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పాక్ మద్దతు ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంతో ఉగ్రవాదంపై ఆగ్రహం పెరిగింది. అనంతరం మే 7న భారత్ “ఆపరేషన్ సిందూర్” ద్వారా ప్రతీకారం తీర్చుకుని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. దీని వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
భారత్–పాక్ ద్వైపాక్షిక క్రీడా ఈవెంట్లలో పాల్గొనదు. భారత జట్లు పాకిస్తాన్‌లో ఆడవు, పాకిస్తాన్ జట్లను భారత్‌లో ఆడనివ్వము. అయితే అంతర్జాతీయ, బహుపాక్షిక పోటీలలో మాత్రం పాక్ ఆటగాళ్లు ఉంటే భారత జట్లు కూడా పాల్గొంటాయి. అలాగే, భారత్ నిర్వహించే అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాక్ ఆటగాళ్లు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపింది.
