ఆసియా కప్ 2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇక ఆసియా కప్‌లో ప్రధానంగా దాయాదుల పోరుపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ప్రాక్టీస్‌పై దృష్టి సారించాయి. భారత్ జట్టు ఇప్పటికే మైదానంలో శిక్షణలో ఉండగా, రెండు జట్లు ఒకే సమయంలో కలుస్తాయా? ఆటగాళ్లు పరస్పరం పలకరించుకుంటారా? అనే ఆసక్తి నెలకొంది.
భారత్ జట్టు శిక్షణ దాదాపు మూడు గంటలు సాగింది. స్పెషలిస్ట్ బ్యాటర్లు ఒక్కొక్కరు గంటకు పైగా నెట్స్‌లో గడిపారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు సెంటర్ వికెట్‌లోకి వచ్చి బంతిని అన్ని వైపులా బాదారు. ఇది సాధారణ నెట్స్ కంటే ఎక్కువగా రేంజ్ హిట్టింగ్ సెషన్‌గా మారింది.
ఇదే సమయంలో పాకిస్థాన్ జట్టు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు టర్న్, బౌన్స్ ఉన్న పిచ్‌లపై ప్రాక్టీస్ చేశారు. నెట్స్ వెలుపల షాహీన్ షా అఫ్రిది తేలికపాటి వ్యాయామం చేస్తుండగా, హారిస్ రౌఫ్ ల్యాప్స్ వేశాడు.
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, జితేశ్ శర్మలు నెట్స్‌లో దిగారు. వీరికి జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశారు. భారత్ జట్టు శనివారం రాత్రి దాదాపు నాలుగు గంటల శిక్షణ తర్వాత సెషన్‌ను ముగించింది. ఆదివారం విశ్రాంతి తీసుకుని, సెప్టెంబర్ 10న యుఎఇతో ఆరంభమయ్యే ఆసియా కప్ మ్యాచ్ ముందు భారత్ మరో రెండు శిక్షణ సెషన్లు నిర్వహించనుంది.
