ఏపీ కూటమి రాజకీయాల్లో అంతర్గత చీలికలు మొదలయ్యాయని టీడీపీ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా స్పందించిన ఆయన, హద్దులు దాటితే ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను మంత్రి అయినప్పటి నుంచి ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదని, ఎవరి జోలికి కూడా వెళ్లలేదని చెప్పారు. అయినప్పటికీ కొంతమంది కావాలనే తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటూ రాజకీయ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తనపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నవారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని టీజీ భరత్ సూచించారు. నన్ను గెలికితే మీరే ఇబ్బంది పడతారు. నా స్ట్రాటజీలు తట్టుకోలేరు అంటూ గట్టి హెచ్చరిక చేశారు. తాను మౌనంగా ఉన్నానని బలహీనతగా భావిస్తే అది పెద్ద పొరపాటేనని అన్నారు. అవసరమైతే రాజకీయంగా గట్టిగా స్పందించగల శక్తి, అనుభవం తనకు ఉందని స్పష్టం చేశారు.
కూటమిలో ఉన్నప్పటికీ పరస్పర గౌరవం, సమన్వయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల కోసం పనిచేయడమే తన ధ్యేయమని చెప్పారు. కానీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రాంతంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తే సహించబోనని స్పష్టం చేశారు. టీజీ భరత్ వ్యాఖ్యలు ఏపీ కూటమిలోని అంతర్గత అసమ్మతులు బయటపడుతున్నాయనే చర్చకు దారితీశాయి.
