కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్ర రైతులు విలవిల్లాడుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు కనీస మద్దతు ధర (MSP) సరిగా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధరను అమలు చేశామని, రైతు ప్రయోజనాలే ధ్యేయంగా విధానాలు అమలు చేశామని గుర్తు చేశారు.
ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన “తల్లికి వందనం” పథకం కూడా సగం మందికే పరిమితమైందని బొత్స ఆరోపించారు. అర్హులైన అనేకమంది లబ్ధిదారులు పథకం ప్రయోజనాల నుంచి దూరమవుతున్నారని, ఇది కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులకు బీమా కూడా అందని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రీమియం కట్టే స్థితిలో కూడా రైతులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి కీలకమైన యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు ఎరువుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఒకవైపు ఖర్చులు పెరుగుతుంటే, మరోవైపు మద్దతు ధర, బీమా, ఎరువులు లేక రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు.
రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మార్చాలని, వైసీపీ పాలనలో అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
