52 రోజుల రిమాండ్ తర్వాత చంద్రబాబు ఆరోగ్య సమస్యల కారణంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక పలు కండీషన్స్‌తో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుండి బయటికొచ్చిన చంద్రబాబు కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. జైలు వద్దకు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ సీఐడీ.
కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంగా పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడవద్దని, అలాగే ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని కానీ చంద్రబాబు రాజమండ్రి జైలు నుండి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకునే వరకు రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ఇక టీడీపీ శ్రేణులు ఉన్న ప్రతీచోటా అభివాదం చేస్తూ ముందుకుసాగారు బాబు. అయితే వాస్తవానికి ఇవాళ చంద్రబాబు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి.
కానీ జైలు నుండి విడుదలైన తర్వాత పరిణామాలను గమనిస్తే ప్రతీచోటా చంద్రబాబు కోర్టు ఆదేశాలను ధిక్కరించడం స్పష్టంగా కనిపించింది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు లాయర్లు ఆయనకు జరుగుతున్న పరిణామాలను వివరించి రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారట. లేకపోతే కోర్టు మధ్యంతర బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందని చెప్పడంతో తిరుమల టూర్‌ని కూడా రద్దు చేసుకున్నారు చంద్రబాబు. ఉండవల్లిలోని తన నివాసం నుండి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు. మొత్తంగా ఎక్కడ బెయిల్ రద్దవుతుందోనని చంద్రబాబు భయపడ్డారని…అందుకే తిరుమల టూర్ క్యాన్సిల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
