తెలంగాణలో 2029లో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీకి కేవలం 1/3 స్థానాలకే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రత్యర్థి పార్టీల నాయకులు అహంకారం, అసూయను తగ్గించుకోవాలని సూచించారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు స్పష్టమైన నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారని వివరించారు. అదేవిధంగా, 808 మంది కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు కూడా గెలుపొందడం పార్టీ బలాన్ని చాటుతోందని అన్నారు. మొత్తం ఫలితాల్లో 66 శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కాయని వెల్లడించారు.
ఇతర పార్టీల విషయానికి వస్తే, బీఆర్ఎస్ 3,511 స్థానాల్లో, బీజేపీ 710 స్థానాల్లో మాత్రమే గెలుపొందిందని సీఎం పేర్కొన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా ఆయన అభివర్ణించారు.
“ఈ ఫలితాలతోనైనా ప్రత్యర్థి పార్టీలకు కనువిప్పు కలగాలి. ప్రజలు ఎవరి వెంట ఉన్నారో స్పష్టంగా తేలిపోయింది,” అని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, అదే 2029లో కూడా పార్టీ విజయానికి కారణమవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
