జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ, కోనసీమలో కొబ్బరి చెట్లు నాశనం అవ్వడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అనిరుధ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ, “మా తెలంగాణ ప్రజల దిష్టి తగిలితే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా? ఒక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి అలా మాట్లాడటం ఏమాత్రం సరికాదు” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఇలాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఒక రాజకీయ నాయకుడిగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి కృషి చేయాల్సింది పోయి, ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
