అస్సాంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కల్లోలం నెలకొంది. మాజీ ఏపీసీసీ చీఫ్ భూపేన్ కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు స్థానిక నేతలు ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడి నిర్ణయాన్ని పునరాలోచించారని చెప్పినా, తాజా పరిణామాలు చూస్తే ఆయన కాంగ్రెస్‌తో పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం కీలకంగా మారింది. కాంగ్రెస్‌పై తాజా విమర్శల్లో భాగంగా బోరా మాట్లాడుతూ, తాను 32 సంవత్సరాలు పార్టీకి సేవలందించినప్పటికీ గౌరవ్ గగోయ్ తనను పలుమార్లు అవమానించారన్నారు. ఈ విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజం లేకపోయిందని ఆరోపించారు.
ఎమ్మెల్యే నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగాను… 2021లో అధ్యక్షుడైనప్పుడు AIUDFతో ఉన్న పొత్తును విరమించాను. తర్వాత 16 పార్టీలతో కూటమి ఏర్పాటుకు కృషి చేశాను. కానీ బైఎలక్షన్ సమయంలో నిర్ణయించిన అభ్యర్థిని మార్చి, కాంగ్రెస్ సభ్యుడే కాని వ్యక్తిని ప్రకటించారు. నేను ఎదుర్కొన్న అవమానాన్ని తట్టుకోలేకపోయాను అని ఆయన అన్నారు.
ఈ వివాదంపై స్పందించిన గౌరవ్ గొగోయ్…బోరా బీజేపీలో చేరేందుకు కారణాలు వెతుకుతున్నారని విమర్శించారు. బీజేపీలో చేరేవారికి స్క్రిప్ట్ ఇస్తారు. కాంగ్రెస్‌లో సమస్యలుంటే, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే మరో పార్టీలో చేరాలి. రాజీనామా చేసిన ఒక్కరోజులోనే సీఎం హిమంత బిశ్వ శర్మతో చేయి కలపడం ఎందుకు అని ప్రశ్నించారు.
