Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీనా?జనసేనా?..తేలని పంచాయితీ?

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానంగా జనసేన బలంగా ఉన్న జిల్లాల్లో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడుతోంది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. ఇక్కడ మెజార్టీ సీట్లు మాకేనంటే..మాకేనని రెండు పార్టీల నేతలు పంచాయితీలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల అధ్యక్షులు రీ సర్వేకు సిద్ధమయ్యారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. ఇక జనసేన ఆశీస్తున్న స్థానాల్లో టీడీపీ కూడా బలంగా ఉండటమే అసలు సమస్యకు కారణం. ఇందులో రాజమండ్రి రూరల్‌, కాకినాడ రూరల్‌, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఉండగా ఈ నియోజక వర్గాల్లో రీ సర్వేకు సిద్ధమయ్యారు ఇరు పార్టీల అగ్రనేతలు.

రాజమండ్రి రూరల్‌లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేశ్.. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇద్దరూ కీలక నేతలే కావడంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తున్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ నుండి బీసీ వర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు భార్య మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి టికెట్ ఆశీస్తుండగా జనసేన నుంచి పీఏసీ సభ్యుడు పంతం నానాజీ టికెట్‌ ఆశిస్తున్నారు.

ఇక పిఠాపురం నుండి జనసేనాని పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ టికెట్ ఆశీస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మండపేట నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ-జనసేన అభ్యర్థులు టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా మూడుసార్లు గెలవగా మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. జనసేన నుంచి వేగుళ్ల లీలాకృష్ణ సైతం పోటీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో అన్నదమ్ములిద్దరూ టీడీపీ-జనసేన నుంచి ఆశావహుల లిస్టులో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం, జనసేన నుంచి బండారు శ్రీనివాస్‌ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు పంచాయితీ ఎప్పుడు కొలిక్కి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -