- Advertisement -

ఏకంగా చంద్రుడిపైనే నగరం!

- Advertisement -

టెక్ దిగ్గజం, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. అంగారక గ్రహంపై మానవ ఆవాసాలు ఏర్పాటు చేయాలనే తన దీర్ఘకాల లక్ష్యాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే పదేళ్లలోపే చంద్రుడిపై స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని నిర్మించడంపై స్పేస్‌ఎక్స్ ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు.

అంగారకుడితో పోలిస్తే చంద్రుడిపై నగర నిర్మాణం చాలా వేగంగా, ఆచరణలో సాధ్యమవుతుందని మస్క్ వివరించారు. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడే దిశగా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అత్యంత వేగవంతమైన, సులభమైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక, లాజిస్టికల్ కారణాలను కూడా వివరించారు.

మస్క్ చెప్పినట్లుగా, అంగారక గ్రహానికి ప్రయాణం చేయాలంటే భూమి–మార్స్ గ్రహాల అనుకూల స్థితి కోసం సుమారు 26 నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. అంతేకాదు, ప్రయాణానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఇదే సమయంలో చంద్రుడికి మాత్రం ప్రతి 10 రోజులకు ఒకసారి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపే అవకాశం ఉందని, ప్రయాణానికి కేవలం రెండు రోజులు మాత్రమే సరిపోతాయని ఆయన తెలిపారు. ఈ కారణంగా నిర్మాణ సామగ్రి, సిబ్బంది రాకపోకలు సులభమవుతాయని, నగర నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయవచ్చని చెప్పారు.

అయితే, అంగారకుడిపై నగరం నిర్మించే ప్రణాళికను పూర్తిగా విరమించుకోవడం లేదని మస్క్ స్పష్టం చేశారు. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో మార్స్‌పై నగర నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభిస్తాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మానవ నాగరికత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై నగర నిర్మాణానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -