రాష్ట్రంలో పేదలకు కొండంత అండగా నిలిచిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తోందని మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ పరిధిని తగ్గించడం.. నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులు నిలిపివేయడంపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
తన ప్రభుత్వ హయాంలో పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చామని అలాగే అనేక వ్యాధుల బారిన పడిన వారికి ఈ పథకం వరంలా నిలిచిందని తెలిపారు. అంతేగాదు చికిత్స పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచామని వైఎస్ జగన్ గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ కోతలు విధిస్తూ, పథకాన్ని నామమాత్రంగా మారుస్తోందని ఆరోపించారు.
నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుండి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల, వారు ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అందించేందుకు వెనుకాడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ఆరోగ్య ఆసరా వంటి అనుబంధ పథకాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయాలని, పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
