ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. 6న ఢిల్లీలో జరిగే వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.
సెప్టెంబర్ 9న అవినీతి కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయగా అప్పటినుండి రిమాండ్‌లోనే ఉన్నారు. అయితే తాజాగా జగన్ ఢిల్లీలో పర్యటించనున్న నేపథ్యంలో బాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందని ప్రచారం జరుగుతుందన్న నేపథ్యంలో బాలకృష్ణ దానిని ఖండించారు. బీజేపీతో దగ్గరయ్యేందుకే బాలయ్య ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్న తరుణంలో జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఏం జరుగుతుందోనని టీడీపీ నేతలు భయాందోళనలో ఉన్నారు.
దీంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విభజన హామీల ప్రస్తావనను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం కు అడహక్ నిధుల కోసం జగన్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రపెద్దలను కలిసి ఈ విషయంపై చర్చించనున్నారు జగన్. అలాగే టీడీపీ – జనసేన పొత్తు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలు లేవని జగన్ చెప్పినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ముందస్తు ఎన్నికలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
