జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘నవనిర్మాణ సభ’ పెట్టాలనుకోవడంపై ఆమె ఘాటుగా స్పందించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని అంటారా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా…ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ముందు తమ సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టాలని కవిత హితవు పలికారు. ప్రతి వానకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మునిగిపోతుంటే, అక్కడి సెక్రటేరియట్‌లోకి నీళ్లు వస్తుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానమో ఆలోచించుకోవాలన్నారు. సొంతంగా ఒక రాజధానిని కూడా కట్టుకునే చేతకాని వారు…ఇక్కడికి వచ్చి తెలంగాణ నవనిర్మాణం చేస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు విడిపోలేదని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని కవిత హితవు పలికారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ఏపీ రాజకీయ నాయకులకు ఏజెంట్లా మారారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ నాయకులకు ఒక భయం ఉండేదని కానీ ఇప్పుడు హద్దులు మీరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడపడితే అక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతున్నారని….తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలన్నింటినీ కూల్చేసి ఏపీకి పార్శిల్ చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణకు ఎవరైనా రావచ్చు, పోవచ్చు, వ్యాపారాలు లేదా షూటింగ్‌లు చేసుకోవచ్చని కానీ సెక్రటేరియట్లో కూర్చుని ఏపీ నేతలు చక్రం తిప్పుతామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని కవిత స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చి లేనిపోని పెత్తనాలు చేయాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
