రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అదిలాబాద్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు ఇతర పార్టీ నేతలను పరామర్శించిన అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన కేటీఆర్… మా పార్టీ అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదే కాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, దుర్మార్గాలను మొత్తం రాష్ట్రం గమనించింది అన్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి 10 స్థానాలు, మాతో పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి 4 స్థానాలు – మొత్తం 14 స్థానాలు వస్తే అధికారం చేజిక్కకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసింది. కేవలం ఏడు స్థానాలు 22 స్థానాల్లో గెలిచినా అప్రజాస్వామికంగా ఆ మున్సిపాలిటీని దక్కించుకునే అధికార దాహం, కక్కుర్తి కాంగ్రెస్ పార్టీ చూపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు స్థానిక మంత్రి వివేక్ దురాగతాలు, అధికార యంత్రాంగం పూర్తిగా అరాచకంగా ప్రవర్తించి ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేశారు.
కేవలం అక్కడే కాకుండా అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నం వంటి చోట్ల కూడా ఇదే రకమైన అరాచకాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే క్యాతన్‌పల్లిలో ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మా 14 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి లొంగకుండా నిలబడితే, మా పార్టీ మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి దాడికి దిగినా అక్కడ ఉన్న మంత్రి గానీ, ఎంపీ గానీ నవ్వుకుంటూ చూశారు కానీ నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇంత దిగజారుడు రాజకీయం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండదు.
మరోవైపు జనగామలో కూడా దళిత మహిళా కౌన్సిలర్‌ను చేయి పట్టి బలవంతంగా గుంజి చిల్లరగా ప్రవర్తించారు. అయితే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అరాచకాలను అధికారుల అక్రమాలను ప్రశ్నిస్తే మా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారితో పాటు ఉపాధ్యక్షులు మున్సిపల్ ఉపాధ్యక్షులు మూల రాజిరెడ్డిని, ఇంకొంతమంది పార్టీ నేతలను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే అరాచకాలను అడ్డుకున్నందుకే మా పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి సొంత పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కానీ, బీజేపీ ఎంపీ అరవింద్ కానీ అడ్డగోలుగా బూతులు తిట్టిన, బట్టలు ఊడదీసి కొడతా అన్న, ఈడియట్ అంటూ యూజ్ లెస్ ఫెలో అంటూ మాట్లాడిన ఎలాంటి కేసులు పెట్టలేదు పోలీసులు.
అయితే రాష్ట్ర డీజీపీ ఒక పార్టీకి ఒక న్యాయం, కాంగ్రెస్ – బీజేపీకి ఇంకో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల అరాచకాలు డీజీపీకి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఒక్కొక్కరికి మూడు కోట్ల రూపాయల డబ్బులు ఆశ చూపినా నిజాయితీ కలిగిన బిడ్డలుగా కౌన్సిలర్లు లొంగలేదు. మీ పైసలు వద్దు, ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ వెంట ఉంటాం, మా సోదరుడు సుమన్ గారి వెంట ఉంటామంటూ అండగా నిలబడ్డారు. ఇంత బలంగా నిలబడిన మా పార్టీ కౌన్సిలర్లకు, పొత్తు ధర్మానికి అనుగుణంగా నిలబడిన సిపిఐ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అయితే సుమన్‌ని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళకి ఒక్కటే చెబుతున్నా. సుమన్‌కి ఇవాళ జైలుకు పోవడం కొత్త కాదు, ఉద్యమ కాలంలో అనేకసార్లు జైలుకు పోయిండు, ఆరు నెలలకు పైగా వివిధ సందర్భాల్లో జైల్లో ఉన్నాడు. పోలీసుల అరాచకాలు, పోలీస్ స్టేషన్లు అయితే లెక్కలో లేనంత గొప్పగా పోరాటం చేసిండు. అలాంటిది రేవంత్ రెడ్డి ఈ అక్రమ కేసుతో మా నాయకుడిని భయపెట్టిస్తామంటే ఎవరూ భయపడరు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, మళ్ళీ నువ్వు చిప్పకూడు తినే టైం వస్తుంది. తప్పకుండా ఆ రోజు నువ్వు తగిన శిక్షను అనుభవిస్తావు.
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టినాడు – రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది అని. మరి ఈరోజు కాకి బుక్ ఎక్కడికి పోయింది? మీ పోలీసులను యూజ్ లెస్ ఫెలో అన్న, బట్టలు ఊడదీసి కొడతా అన్న కేసు ఎందుకు పెట్టడం లేదు? రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్లకు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి మాకు ఒక నీతి అనే విషయాన్ని డీజీపీ తెలియజేయాలి. డీజీపీ గానీ, రేవంత్ రెడ్డి గానీ అధికారం ఎవడికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రానున్న రెండు సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. కచ్చితంగా మీ అరాచకాలకు అప్పుడు తగిన శిక్షను అనుభవిస్తారు. ఈరోజు చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా ఎక్కడున్నా పట్టుకొని కచ్చితంగా శిక్షిస్తాం.
ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే క్యాతన్‌పల్లి మరియు ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకతగా పెట్టాలి. సీసీ కెమెరాల మధ్య సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనివ్వండి, గెలిచిన వాళ్లను ప్రమాణ స్వీకారం చేయనియ్యండి. రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు అవసరమైతే కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పనిచేయాలని హెచ్చరిస్తున్నాము. ఎవరు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ గుర్తుంచుకొని కచ్చితంగా వాళ్లను వదిలిపెట్టేది లేదు. మా ఎమ్మెల్యే ఆదివాసీ బిడ్డ కోవ లక్ష్మి గారి పైన కూడా అక్రమంగా కేసు పెట్టారు. నిజాయితీగా పార్టీ పని చేసి, ప్రజాస్వామికంగా ప్రజల తీర్పును గౌరవించేలా కాపాడుకోవడమే ఆమె చేసిన తప్పా? ఇలా అడ్డగోలుగా అక్రమ కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో శిక్ష అనుభవించక తప్పదు. ఈ మొత్తం మున్సిపల్ ఎన్నికల దుర్మార్గాలను ఎలుగెత్తి బయటకు తీసుకువచ్చిన మీడియాకి, సోషల్ మీడియాలో బలంగా మా పార్టీ తరపున పనిచేసిన సోషల్ మీడియా వారియర్లకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈరోజు కూడా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సుమన్ మరియు పార్టీ నాయకుల బెయిల్ కోసం న్యాయస్థానాలను పార్టీ లీగల్ న్యాయస్థానాల్లో ప్రభుత్వ అరాచకాలను ఎదిరిస్తున్నది. న్యాయ నిపుణులు, మా లీగల్ టీమ్ అంతా ఉన్నారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కోర్టు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాం. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా మరి మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించారో, వారి మీద చర్యలు తీసుకోండి, వారిని జైల్లో పెట్టండి. మా నాయకులను వదిలిపెట్టండి అని చెప్పి న్యాయస్థానానికి కూడా మా న్యాయవాదులు అప్పీల్ చేస్తారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, తప్పకుండా న్యాయం గెలుస్తుంది అన్నారు.
