మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల వ్యవహారంపై కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆరోపణలు చేశారు. నేను పిల్లిని కాదు.. టైగర్‌ను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఎన్నికల్లో పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.
కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఉన్న స్నేహం కారణంగానే గత రెండేళ్లుగా అనేక అవమానాలను సహించాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం తనకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి అనుమతించి, తమ అభ్యర్థులను మాత్రం అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసుల చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని, అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కించపరుస్తోందని అన్నారు.
“ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? జైలులో పెడతారా? పెట్టండి… నాకు అది కొత్తేమీ కాదు” అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
