మీడియాతో చిట్‌చాట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులు, అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ విమర్శలు గుప్పించిన కవిత, పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న వ్యక్తి హరీష్ రావు అని వ్యాఖ్యానిస్తూ, ఇలాంటి నిర్ణయాల వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
భవిష్యత్‌లో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్తే బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. పిల్ల కాకులకు అసెంబ్లీలో బాధ్యతలు ఇవ్వడం ఏంటి? అంటూ పార్టీ నాయకత్వంపై పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తారు. కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని, అప్పుడే పార్టీని కాపాడుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో జూరాల నుంచి మార్చిన నిర్ణయం చారిత్రక తప్పిదమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్న తీరుపై స్పందిస్తూ ఆయనను తిడుతుంటే ఆయన బిడ్డగా నా రక్తం మరుగుతోంది అన్నారు. కేసీఆర్ త్యాగం, ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆరోపణలు చేసే వారి నోర్లు మూయేలా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో బబుల్ షూటర్లతో సమాధానాలు చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదని, వీళ్ల వల్లే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని అన్నారు. అక్రమాలు చేసిన వారిని పదవుల్లో కూర్చోబెట్టడమే పార్టీకి నష్టం చేస్తోందని, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఆ భగవంతుడు కూడా పార్టీని కాపాడలేడని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.
