కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి ప్రకటించిన ప్రధాని.. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.
బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవదహనమవడం అత్యంత విషాదకరమని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతూ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురికావడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన ఎంతో బాధించిందని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
