మదనపల్లె ఫైళ్లు దగ్దం కేసులో రాజకీయ రంగు పులిమి మమ్మల్ని ఇరికించాలనే కుట్ర జరుగుతోందన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ కేసులో అత్యుత్సాహంతో డీజీపీని పంపించి చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారని..ఈ కుటలన్నీ ఎదుర్కొంటాం అని తేల్చిచెప్పారు. మాపై పెట్టిన కేసులు తప్పని నిరూపిస్తామని..ఎన్నికల హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మదనపల్లె ఫైళ్లు దగ్ధం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. నిజాలతో సంబంధం లేకుండా మా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చంద్రబాబు తన అనకూల పత్రికల్లో అవాస్తవాలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు.
మదనపల్లెలో రికార్డులు తగలబడితే మాపై నిందలు వేయడం సరికాదన్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగించినా, సీబీఐకి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదని… ఆ కేసుకు, నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నారు. వైసీపీ నాయకులపై కేసులు వేసి, వారి ద్వారా నా పేరు చెప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మా కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు… మా ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచాం అన్నారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
