ఒకప్పుడు బెంగాల్‌ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని కొల్పోవడం, ఆ తర్వాత తృణమూల్ నేతలపై వరుస దాడులు.. ఇప్పుడు ఎమ్మెల్యేల తిరుగుబాటు లేడి సింగంగా పేరు తెచ్చుకున్న మమతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
పార్టీ నుండి బహిష్కరణకు గురైన టీఎంసీ ఎమ్మెల్యేలు రీతాబ్రతా బెనర్జీ మరియు సందీపన్ సాహా బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. తమకు కనీసం 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని వారు ప్రకటించారు. ఈ తిరుగుబాటు వర్గం రీతాబ్రతా బెనర్జీని కొత్త ప్రతిపక్ష నేతగా (LoP) నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేగాదు రెబల్ ఎమ్మెల్యేలకు పార్టీ పేరు, గుర్తు దక్కే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ 80 స్థానాల్లో విజయం సాధించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection law) పరిధిలోకి రాకుండా తప్పించుకోవడానికి మరియు తమ వర్గానికి అసలైన టీఎంసీ పేరు, గుర్తు లభించేలా చూసుకోవడానికి ఈ 80 మందిలో కనీసం మూడింట రెండు వంతుల (అనగా 54 మంది) ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం రీతాబ్రతా మరియు సందీపన్‌లకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో వారు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా అధికారిక టీఎంసీని తమ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. తాము కొత్త పార్టీ ఏదీ పెట్టడం లేదని, పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను త్వరలోనే స్పీకర్‌కు సమర్పించనున్నామని ఆ వర్గం తెలిపింది.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ నిర్వహించిన మొదటి బహిరంగ ర్యాలీకి పార్టీలోని 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. అది కూడా పాత తరం నేతలు మాత్రమే కావడం గమనార్హం. అంతకుముందు ఫేస్‌బుక్ లైవ్‌లో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రీతాబ్రతా ఒక నయవంచకుడు , సిద్ధాంతాలు లేని వ్యక్తి అంటూ మండిపడ్డారు. మొత్తంగా మమతా చేతిలోనుండి తృణమూల్ చేజారిపోతుందా?…రెబల్ ఎమ్మెల్యేల నెక్ట్స్ స్టెప్ ఏంటనేది పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠను రేపుతున్నాయి.
