సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటైనా ఇచ్చారా అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. మీడియాతో మాట్లాడిన జగన్…. ఆడబిడ్డ నిధి లేదు..దీపం పథకం అందరికీ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి..ఆరోగ్య ఆసరా ఇలా ఏమీ ఇవ్వకుండా జనాన్ని మోసం చేశారు అన్నారు. అప్పులతో మేం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాం… అప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు.. ఎక్కడ పెట్టారు. రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక అయిపోదా చెప్పాలని దుయ్యబట్టారు.
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు అని తేల్చిచెప్పారు జగన్. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు అన్నారు. మూడేళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమేనని తేల్చిచెప్పారు.చంద్రబాబుతో పాటు పావులుగా మారిన అధికారులు వడ్డీతో సహా చెల్లిస్తారని వార్నింగ్ ఇస్తున్నా అన్నారు. సినిమా డైలాగులు పోస్టర్ల మీద వాడినందుకు ఇద్దరిని రిమాండ్‌కి పంపించారు… డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? చెప్పాలన్నారు.
నచ్చిన పాట పాడినా, నచ్చిన డైలాగులు పెట్టుకున్నా తప్పే అంటే ఎలా?.. ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి అన్నారు. దాన వీర శూర కర్ణ కన్నా చంద్రబాబు గొప్పగా యాక్టింగ్ చేస్తున్నాడు… చంద్రబాబు లైవ్ యాక్షన్ ముందు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిపోయాడు అని ఎద్దేవా చేశారు. మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారు. చంద్రబాబు చెప్పినట్టు వినకపోతే డీజీ స్థాయి అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేస్తున్న పరిస్థితి నేడు కనిపిస్తోంది అన్నారు.
రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ. మిగిలిన పార్టీలన్నీ అధికారంలో భాగస్వాములై ఉన్నవే. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్నది ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ప్రశ్నిస్తున్న పార్టీ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఏడాది కాలంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా రైతులకు, విద్యార్థులకు తోడుగా నిలిచాం. ప్రతిపక్ష పార్టీగా మా లక్ష్యం ప్రజా ప్రయోజనమేనని తేల్చిచెప్పారు జగన్.
