ఏపీ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నందికొట్కూరులో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.స్థానిక ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలోనే మాజీ కౌన్సిలర్లు నడిరోడ్డుపై ఒకరినొకరు తీవ్రంగా దూషించుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ తన వార్డులో జరిగే కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాగ్వాదం ప్రారంభమైంది.
దీనికి స్పందించిన మరో మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి.. “నీకు ఎందిరా చెప్పేది?” అంటూ జాకీర్ హుసేన్‌పై మండిపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, పరస్పరం తీవ్రంగా దూషించుకున్నారు.
ఎమ్మెల్యే సమక్షంలోనే “నువ్వేంత అంటే నువ్వేంత” అంటూ ఇద్దరు నేతలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలు ఈ ఘటనను ఆశ్చర్యంగా చూశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే జయసూర్య పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించినా, వాగ్వాదం కొనసాగడంతో చివరకు ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటన టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలను బహిరంగంగా చూపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక నాయకత్వంలో సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
