ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం తల్లికి వందనం . ఈ పథకం కింద రెండో విడత నిధుల విడుదలకు సర్కార్ సిద్ధమైంది. జూన్ నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు తెరిచిన కొద్దిరోజులకే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందులో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ కమిటీ ఖాతాకు తరలిస్తారు. మిగిలిన రూ.13 వేల నగదును నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు. పేద మధ్య తరగతి వర్గాల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కుటుంబంలో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరూ అర్హులే.
అయితే గత సంవత్సరం కొన్ని పొరపాట్ల వల్ల చాలామంది అర్హులైన విద్యార్థులు ఈ పథకాన్ని అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి ముందస్తు చర్యలు చేపట్టారు. గత విద్యాసంవత్సరం ఆధార్ అనుసంధానంలో ఇబ్బందులు తలెత్తడం, మరికొన్ని సాంకేతిక కారణాలు రావడతో ఈసారి ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూస్తున్నారు అధికారులు.
లబ్ధిదారులైన తల్లులందరూ తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యను తక్షణమే అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. కేవలం ఆధార్ లింక్ చేయడమే కాకుండా సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఎన్పీసీఐ మ్యాపింగ్ కూడా పూర్తి చేయించుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు నేరుగా ఖాతాల్లో పడాలంటే ఎన్పీసీఐ యాక్టివ్ తప్పనిసరి.
పాఠశాలల పునఃప్రారంభ సమయానికి ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని విద్యాశాఖ గడువు విధించింది.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా తమ బ్యాంకు ఖాతాల స్థితిని సరిచూసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
