ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్ అయ్యారు. రాజ్యాంగం గురించి తరచుగా మాట్లాడే పవన్ కళ్యాణ్..రాష్ట్రంలో పెరుగుతున్న దాడులు, దారుణాలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ గుర్తు చేస్తే, మాపై దాడి చేస్తారా? ఇదేనా రాజ్యాంగ పరిపాలన? అని ప్రశ్నించారు.
మచిలీపట్నం మంగినపూడిలో ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గిరి పై జరిగిన దాడిని ప్రస్తావించిన నరేంద్ర..ఒక వృద్ధుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించడం, దాడి చేయడం ఏ రాజ్యాంగం అనుమతిస్తుంది? ఆ దాడిలో కీలక నిందితుడు కొరియా శ్రీను జనసేనలో ముఖ్యపదవిలో ఉన్నాడు అని అన్నారు.
ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో 30,000 మహిళలు గల్లంతయ్యారని ఆయననే చెప్పారు. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? సమాధానం ఎక్కడ? అని నరేంద్ర ప్రశ్నించారు.
ఈ వైఫల్యాలపై ప్రశ్నలు రాకుండా చేయడానికే మా కార్యకర్తలపై దాడులు ప్రోత్సహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాలి – ఈ దాడులు ఏ రాజ్యాంగం ప్రకారం న్యాయసమ్మతం? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను ఒక ‘రెడ్ బుక్ పాలన’లా నడుపుతున్నారు అని అన్నారు.
