- Advertisement -

విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైసీపీ

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి . విలువలు, విశ్వసనీయతకు ప్రతీకగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగన్, అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి, 2011 మార్చి 12న స్థాపించబడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. చాలా కష్టసాధ్య పరిస్థితుల్లో ఈ పార్టీ పుట్టిందని ఆయన గుర్తుచేశారు. నల్లకాలువలో ఇచ్చిన ఒక మాటే ఈ పార్టీ ఆవిర్భావానికి, ఎదుగుదలకు కారణమైందని అన్నారు. ఆ ఒక్క మాట తన కుటుంబ పరిస్థితులను మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల దిశను కూడా మార్చిందని చెప్పారు.

విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెప్పే రాజకీయాల కోసం వైయస్సార్‌సీపీ పుట్టిందని జగన్ అన్నారు. ఈ పార్టీ ఒక్క జగన్‌ది మాత్రమే కాదని, కోట్లాది కార్యకర్తలు, అభిమానులది అని స్పష్టం చేశారు. మహానేత వైయస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ప్రతి కుటుంబ సభ్యుడి పార్టీ ఇదేనని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

పార్టీ స్థాపన సమయంలో ఎన్నో రాజకీయ ఒత్తిడులు, కుట్రలు ఎదురైనా తాను ఎప్పుడూ భయపడలేదని జగన్ చెప్పారు. అప్పట్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి తనపై కుట్రలు పన్నాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలపై, దేవుడిపై ఉన్న విశ్వాసమే తనకు బలమైందని తెలిపారు.

తాను ఎప్పుడూ దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని, వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని జగన్ అన్నారు. భవిష్యత్తులో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

నాతో పాటు నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా కాలర్ ఎగరేసుకుని “అదిగో మా పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ” అని చెప్పుకునేలా పార్టీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -