లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. శనివారం దాదాపు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు అనంతరం నోటీసులిచ్చి అరెస్ట్ చేశారు.
ఇక ఇవాళ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టారు సిట్ అధికారులు . ప్రాసిక్యూషన్ తరపున ఇ.కోటేశ్వరరావు వాదనలు వినిపించగా మిథున్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టుకు వచ్చారు వైసిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి ,భరత్.
మిథున్ రెడ్డిని అరెస్ట్ ను వైసీపీ ఖండించింది. చంద్రబాబు కక్ష రాజకీయాలకు ఇది పరాకాష్ట అని వైసీపీ నాయకత్వం మండిపడింది. ఈ తరహా చర్యలు ఎల్లకాలం సాగవని హెచ్చరించింది. మరోవైపు 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు సిట్ అధికారులు. దీంతో పాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు.
