తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధురంధర్ ది రీవెంజ్ సినిమా ప్రీమియర్ షోలు విడుదలకు కొన్ని గంటల ముందు రద్దు కావడం నిరాశ కలిగించింది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆదిత్య దర్ దర్శకత్వం వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగాల్సిన పలువురు ప్రీమియర్ షోలు కంటెంట్ డెలివరీ ఆలస్యం కారణంగా రద్దయ్యాయి. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ప్రస్తుతం అనేక థియేటర్లలో బుకింగ్స్ నిలిపివేయడం లేదా రద్దు చేయడం జరిగింది. అయితే కొన్ని కేంద్రాల్లో మాత్రం ఇంకా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ప్రీమియర్ షోలు ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉండగా ఈ అకస్మాత్తు మార్పులు ప్రేక్షకుల్లో గందరగోళం, అసహనం కలిగిస్తున్నాయి.
