ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కొత్త తలనొప్పి పట్టుకుంది. రాష్ట్రమంతా రెండు రోజుల పాటు జరిగిన తెలుగు మహాసభలపై ఫోకస్ ఉండగా ఆదివాసీల ఆందోళనతో ప్రజలు దృష్టంతా అటువైపే పోయింది. ఏదో అనుకూల మీడియాతో తెలుగు మహాసభలను ఫోకస్ చేస్తున్నారు. కానీ అడవిలో రాజుకున్న ఆందోళనలను అందరూ చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల ఆందోళనలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. జిల్లాల్లో ఆదీవాసీలు బహిరంగ సభలు, ధర్నాలు, ర్యాలీలు చేసిన అనంతరం చివరకు హైదరాబాద్‌లోని సరూర్ స్టేడియంలో ఆదివాసీల భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. నగరమంతా ఆదీవాసీలతో నిండిపోయింది. ఆ తర్వాత ఆదివాసీలకు పోటీగా లంబాడీలు అదే స్టేడియంలో రెండు, మూడు రోజుల తర్వాత శంఖారావం పేరిట సభ నిర్వహించారు. దీంతో లంబాడీలు, ఆదివాసీల మధ్య వివాదం రాజుకుంది.
రెండు రోజుల కిందట కొమ్రం భీం విగ్రహానికి చెప్పుల దండ వేశారని ఉట్నూరులో ఆదివాసీలు ఆందోళనలకు దిగారు. దుకాణాలు దగ్ధం చేసి రచ్చ రచ్చ చేశారు. ఈ గొడవల్లో ఇద్దరు మరణించారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. తెలుగు మహాసభల్లో బిజీగా కేసీఆర్ ఆదివాసీల ఆందోళనలతో ఇరుకునపడ్డారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఆందోళనలను నియంత్రించ లేదనే సాకుతో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు. అంతేకాకుండా పోలీసులను మోహరించి 144 సెక్షన్ విధించారు.
ఆదివాసీల ప్రధాన డిమాండ్: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి. రిజర్వేషన్ల పేరు మీద లంబాడీలు బాగా ప్రయోజనాలు పొందుతున్నారు. ఆర్థికంగా మొదలుకొని అన్ని రంగాల్లో ఎస్టీ పేరు మీద లంబాడీలు అభివృద్ధి చెందుతున్నారని ఆదివాసీల ప్రధాన వాదన. లంబాడీలను తొలగిస్తే తమకు మంచి అవకాశాలు వస్తాయని, తాము అభివృద్ధి చెందుతామని ఆదివాసీలు భావిస్తున్నారు.
లంబాడీల వాదన: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించొద్దు. తొలగిస్తే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని హెచ్చరిక. తాము వెనకబడ్డ వారమని, ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే వెనకబడిపోతామని లంబాడీలు ఆందోళన చెందుతున్నారు.
