- Advertisement -

అట‌ల్ అస్త‌మ‌యం….బాల్యం, విద్యాభ్యాసం, రాజ‌కీయ జీవితం

- Advertisement -

భార‌తీయ జ‌న‌తాపార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, కాజ‌కీయ కుర‌వృద్ధుడు అట‌ల్ అస్త‌మించారు. రాజ‌కీయ జీవిత చ‌రిత్ర‌లో అత్యంత విలువ‌ల‌తో కూడాని రాజ‌కీయం, నిరాడంబ‌ర‌త జీవితాన్ని గ‌డిపిన మ‌హానేత‌. తనను విమర్శించేందుకు రాజకీయ ప్రత్యర్థులకు సైతం ఒక్క అవకాశం ఇవ్వని మహోన్నత విలువలు కలిగిన రాజకీయవేత్త. రాజ‌కీయాల్లో భీష్మ పితామ‌హుడిగా పేరు పొందారు. తన యావత్ జీవితాన్ని భరతమాత సేవకే అర్పించిన గొప్ప వ్యక్తి. ఆయన సేవలకు గుర్తింపుగా భారత్ సర్కారు ఆయనను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సమున్నత రీతిలో గౌరవించింది.

విద్యాభ్యాసం…

భారతరత్న అయిన అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి మరియు కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. వాజపేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ,ఆంగ్లము మరియు సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. ఆయన రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి పొందారు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.

ఆర్యసమాజంలో చేరిన యువ వాజ్ పేయి ఆర్యకుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించారు. 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లో ఆయన ఆరెస్సెస్ లో చేరారు. ఆయనపై బాబా ఆమ్టే ప్రభావం అధికంగా ఉండేది. 1947లో పూర్థి స్థాయిలో ఆయన ఆరెస్సెస్ ప్రచారక్ అయ్యారు. ఇదే సమయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలు మరియు స్వదేశ్, వీర్ అర్జున్ వంటి దినపత్రికలకు కూడా వాజ్ పేయి పని చేశారు. వాజ్ పేయి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

రాజ‌కీయ జీవితం…

1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తొలిసారి ఆయనకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో అన్న ప్రేమ్ తో కలసి 23 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడిపారు.బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనబోనని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎలాంటి సంబంధాలను నెరపనని లిఖిత పూర్వక హామీ ఇచ్చిన తర్వాత ఆయనను జైలు నుంచి విడిచిపెట్టారు.

1951లో అప్పుడే కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ పార్టీలో పని చేయడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్ పేయిని ఆరెస్సెస్ నియమించింది. ఈ పార్టీ ఆరెస్సెస్ కు అనుబంధంగా పని చేసేది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఈ పార్టీకి సంబంధించి ఉత్తరాది విభాగానికి వాజ్ పేయి కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు.

1954లో కశ్మీరులో కశ్మీరేతర భారతీయుల సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారనే విషయమై శ్యాంప్రసాద్ నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు కూడా ఆయన పక్కనే వాజ్ పేయి ఉన్నారు. నిరాహారదీక్ష సమయంలోనే జైల్లో శ్యాంప్రసాద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.

1957లో బల్రామ్ పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్ సభలోకి అడుగుపెట్టారు వాజ్ పేయి. సభలో ఆయన చేసిన మెయిడెన్ స్పీచ్ (తొలి ప్రసంగం) అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతం పార్టీ బాధ్యత మొత్తం ఆయనపై పడింది. 1968లో జనసంఘ్ అధినేతగా ఎదిగారు. అదే సమయంలో అద్వానీ, బల్ రాజ్ మధోక్, నానాజీ దేశ్ ముఖ్ లతో కలసి జనసంఘ్ ను జాతీయ స్థాయి ప్రాముఖ్యత గల పార్టీగా ముందుకు నడిపించారు.

1975 నుండి 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రేస్ పార్టీకి చెందిన ప్రధాని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు అయ్యారు.1977 లో సంఘసంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్ ను క్రొత్తగా యేర్పడిన సంకీర్ణ కూటమి, జనతాపార్టీలో విలీనం చేశారు.

1977లో భారత రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో వాజ్ పేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 1979లో ప్రధానిగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత… కొన్ని రోజులకే జనతా పార్టీ ముక్కలైంది. జనసంఘ్ నేతలు జనతా పార్టీని సంఘటితంగా ఉంచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. అంతర్గత విభేదాలతో విసిగిపోయిన జనసంఘ్ చివరకు జనతా పార్టీ నుంచి బయటకు వచ్చింది.

1980లో జనసంఘ్, ఆరెస్సెస్ ల నుంచి వచ్చిన తన సహచరులు… ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితులైన అద్వానీ, బైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకుని భారతీయ జనతా పార్టీని వాజ్ పేయి ఏర్పాటు చేశారు. బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడు వాజ్ పేయే.

1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ లోక్ సభలో రెండు సీట్లను గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా, లోక్ సభలో విపక్ష నేతగా వాజ్ పేయి కొనసాగారు. ఆ తర్వాత బీజేపీ రామ జన్మభూమి మందిర ఉద్యమాన్ని చేపట్టింది. 1995లో గుజరాత్, మహారాష్ట్రలకు జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని సాధించింది. అక్కడి నుంచి బీజేపీ వెనుదిరిగి చూసుకోలేదు.

1995లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాజ్ పేయిని అద్వానీ ప్రకటించారు. 1996 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. వాజ్ పేయి తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతను స్వీకరించారు. తన జీవితకాలంలో మూడు సార్లు ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ఈ మూడు సార్లూ ఆయన పూర్తి కాలం ప్రధాని పదవిలో ఉండలేకపోవడం గమనార్హం.

ప్రధానిగా వాజపేయి తొలి పర్యాయం: 1996 మే నెల (13 రోజులు)

భారతీయ జనతాపార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించింది. ఆనాటి అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు ఆహ్వానించారు. అపుడు వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు.

ప్రధానిగా రెండో పర్యాయం: 1998-1999 (13 నెలలు)

1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్ని బి.జె.పిలో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా యేర్పడ్డాయి. వాజపేయి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఎన్.డి.ఏ పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైన, జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోవ‌డంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ప్రధానిగా మూడో పర్యాయం: 1999-2004…

కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కూడిన ఎన్డీయే 303 స్థానాలు గెలిచి క్లియర్ మెజార్టీని సాధించింది. 1999 అక్టోబర్ 13న వాజ్ పేయి మూడోసారి ప్రధాని పదవిని అధిష్టించారు.

ఫోక్రాన్ అణుప‌రీక్ష‌లు…

1974 లో తొలిసారిగా “ప్రోఖ్రాన్-I” అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను “ప్రోఖ్రాన్-II”గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు నిర్వ‌హించారు.

2009 ఫిబ్రవరి 6న ఛాతీలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను కొన్నాళ్లు వెంటిలేటర్ పై ఉంచారు. ఆ తర్వాత కోలుకున్నారు. 2001లో ఆయన మోకాలి మార్పిడి చికిత్స చేయించుకున్నారు. 2009లో స్ట్రోక్ కారణంగా ఆయన పక్షవాతానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయన మాట క్షీణించింది. తరచూ అనారోగ్యానికి గురవుతూ వీల్ చైర్ కు పరిమితమయ్యారు. మనుషులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నారు.

గత కొన్ని రోజులుగా ఎయిమ్స్ లో మృత్యువుతో పోరాటం చేస్తూ, చివరకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భరతమాత కంటతడి పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -