మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిరిడీ సాయిబాబా ఆలయానికి ఓ భక్తుడు అరుదైన కానుకను సమర్పించాడు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌కు చెందిన ప్రదీప్ మొహంతి అనే భక్తుడు, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని షిరిడీ సాయిబాబాకు సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.80 లక్షలుగా ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కిరీటాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇందులో 585 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించగా, దానికి తోడుగా 153 క్యారెట్ల విలువైన వజ్రాలను పొదిగారు. సంప్రదాయ శిల్పకళకు ఆధునిక డిజైన్‌ను జోడిస్తూ కిరీటాన్ని రూపొందించారని చెప్పారు. సాయిబాబాపై తనకు ఉన్న అపారమైన భక్తి, కృతజ్ఞతాభావంతోనే ఈ కానుకను సమర్పించానని ప్రదీప్ మొహంతి పేర్కొన్నారు.
ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులు అధికారిక విధానాల ప్రకారం స్వీకరించారు. భద్రతా చర్యలు తీసుకున్న అనంతరం, ప్రత్యేక పూజల మధ్య సాయిబాబా విగ్రహానికి అలంకరణగా ఈ కిరీటాన్ని ఉపయోగించనున్నారు.
