ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు విని.. ఆంధ్రప్రదేశ్ లో కొందరు ప్రజలు ఇదే మాట అంటున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాని సెలవివ్వడంపై.. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే… ఈ కారణాలు చెప్పారు.
కొన్ని రోజులుగా రాష్ట్ర అధికార పార్టీతో పాటు.. విపక్షాలు కూడా అభివృద్ధి కోసం, నిధుల కోసం కేంద్రంపై విపరీతంగా ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ మాత్రమే కాకుండా.. కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ కూడా పోరాడుతున్నాయి. టైమ్ వచ్చినప్పుడల్లా ప్రజలు కూడా ప్రత్యేక హోదా కోసం వాయిస్ వినిపిస్తున్నారు.
కానీ.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంపై ఎలాంటి హామీ రాలేదు. ఆఖరికి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా పని చేస్తున్న అశోకగజపతి రాజు, సుజనా చౌదరి.. చివరికి వెంకయ్యనాయుడు కూడా ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. వారు కూడా పార్లమెంట్ లో.. బయటా.. ఎప్పుడు మాట్లాడినా.. ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు.
కానీ.. విషయం నీతి ఆయోగ్ కోర్టులో ఉందని చెబుతూ.. ప్రధాని నరేంద్రమోడీ తప్పించుకుంటున్న విషయం అందరికీ తెలుసు. ఇలా ప్రత్యేక హోదాపై ఎప్పటికప్పుడు హ్యాండ్ ఇస్తున్న ప్రధాని.. ఢిల్లీలో మాత్రం రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పని చేయాలని పిలుపునివ్వడం.. డబుల్ స్టాండే అని కొందరు విమర్శిస్తున్నారు.
నిజంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ముందుగా ప్రత్యేక హోదా ఇచ్చాకే.. ప్రధాని రాష్ట్రాల సహకారం గురించి మాట్లాడితే.. ఆయన స్థాయికి తగినట్టు ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. కానీ.. అసహనం లాంటి సీరియస్ విషయాల్లో.. జనాలు చనిపోతున్నా.. విపక్షాలు విమర్శిస్తున్నా.. ఏ మాత్రం చలించని.. మాట కూడా మాట్లాడని ప్రధాని.. ఇప్పుడు ఏపీ ప్రజల బాధ ఎంత వరకు పట్టించుకుంటారో.. వారి గోడు ఎంత వరకు ఆలకిస్తారో చూడాలి.
