జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా గవర్నర్ పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రమంలో కాంగ్రెస్ పార్టీ సహకారంతో పీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పీడీపీ – కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభించిన తరుణంలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
87 సీట్లున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరగ్గా ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన పీడీపీ, 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రెండేళ్లలోనే ఆ పొత్తు విచ్ఛిన్నమైంది. దీంతో గత జూన్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.
పీడీపీ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదిపింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసుకొంది. ఈ విషయమై ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్ కు ఆమె లేఖ రాశారు. దీంతో పాటు గవర్నర్‌తో సమావేశ మయ్యారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ను కోరిన కొద్దిసేపటికే అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 44 కాగా, ప్రస్తుతం పీడీపీకి 28 మంది, ఎన్సీకి 15 మంది, కాంగ్రెస్‌కు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే మెజారిటీ సాధించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఇంతలోనే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు గవర్నర్ ప్రకటన జారీ చేశారు.

