కొత్త సంవత్సరం సందర్భంగా 24 గంటల ఉచిత విద్యుత్
చీకట్లు అలుముకుంటూ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిరంతర వెలుగుల మధ్య తారజువ్వలా వెలుగుతోంది. విద్యుత్ కటకటతో పుట్టిన తెలంగాణ ఇప్పుడు విద్యుత్ వెలుగు జిలుగులకు వేదికగా మారింది. నిరంతరాయంగా విద్యుత్ వినియోగించినా నిండుకుండలా విద్యుత్‌తో రాష్ట్రం అలరారుతోంది. అందులో భాగంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అపూర్వ కానుక అందించింది. ఇకపై 24 నిరంతర విద్యుత్ అందిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణ రైతులు ఖుషీలో మునిగారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చీకట్లు అలుముకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కపట నీతితో తెలంగాణను అంధకారంలో నెట్టేశాడు. కరెంట్‌కు కటకట ఉందని తెలిసినా జాలి చూపకుండా విద్యుత్‌ను ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద చొరవ తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి ఐదు రూపాయలకు రూపాయి ఎక్కువ ఇచ్చి మరీ కొనుగోలు చేసి విద్యుత్ కొరత రాకుండా చూసుకున్నారు. ఇక ముందు ఈ కష్టం ఉండొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తమ ఇంజినీర్లతో కలిసి సమాలోచనలు రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ చీకట్లు అలుముకుంటాయోననే భయంతో బతికిన ప్రజలకు రెండో ఏడాదే వేసవిలోనూ ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా చూసుకున్నారు. ఈ పరిణామం చూసిన ప్రజలందరూ ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, ప్రత్యేక కార్యాచరణతో ఇప్పుడు తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారబోతోంది. ఇది పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుకు మింగుడు పడని విషయంగా మారింది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించింది. మారుమూల గ్రామంలో కూడా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రాత్రి 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు ప్రమాదకర స్థితిలో మేల్కొని పొలాలకు నీరు పెట్టేవారు. ఆ సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకునేవి. ఎంతోమంది రైతులు బలయ్యారు. ఈ బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ అలాంటి పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
అయితే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో ఒకింత ఆందోళన ఏర్పడింది. ఎప్పుడు బోర్లు నడుస్తుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు బాధపడుతున్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన కొన్ని గ్రామాల్లో రైతులు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా వద్దని ధర్నాలు కూడా చేస్తున్నారు.
