పేద విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ‘కైండ్ ఇండియా’ ఫౌండేషన్ అడుగులు వేస్తోంది. కలుషిత నీటి వల్ల వచ్చే కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల నుండి విద్యార్థులను రక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక ఆర్వో (RO/UV) ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ అండగా నిలుస్తోంది.
తాజాగా బోరబండలోని నాట్కో గవర్నమెంట్ హై స్కూల్ మరియు ప్రభాత్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన రెండు యూవీ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌లను కైండ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ కుందా ప్రతాప్ ప్రారంభించారు. సుమారు రూ. 2 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 1,800 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందికి ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం ఫిల్టర్లే కాకుండా పూర్తిస్థాయి నీటి సరఫరా వ్యవస్థను ఫౌండేషన్ అభివృద్ధి చేసింది. గంటకు 1000 లీటర్ల శుద్ధి చేయబడిన నీటిని అందించే యూవీ ఫిల్ట్రేషన్ యంత్రాలు…. నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు మరియు పైపింగ్ వ్యవస్థ… విద్యార్థులు రద్దీ లేకుండా నీరు తాగేందుకు వీలుగా వరుసగా స్టీల్ ట్యాపుల ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ కుందా ప్రతాప్ మాట్లాడుతూ.. “పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంటే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. తద్వారా పాఠశాలకు హాజరు శాతం పెరగడమే కాకుండా, వారు చదువుపై మెరుగ్గా దృష్టి సారించగలరని మా సంస్థ భావిస్తోంది” అని తెలిపారు.
కైండ్ ఇండియా ఫౌండేషన్ ఇప్పటికే నాచారం, మౌలాలి, తిరుమల నగర్ ప్రాంతాల్లోని ఐదు పాఠశాలల్లో ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.వచ్చే ఏడాది కాలంలో మరో 100 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఆర్వో సిస్టమ్‌లను ఏర్పాటు చేయాలని సంస్థ బృహత్తర లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తున్న ‘కైండ్ ఇండియా’ ఫౌండేషన్ కృషిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.మరిన్ని వివరాల కోసం లేదా సంస్థకు మద్దతు తెలపడానికి www.kindindia.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
